దామెర్ల రామారావు

20 వ శతాబ్ది తెలుగు వారి ఔన్నత్యం - అక్కిరాజు రమాపతి రావు



దామెర్ల చిత్రం

20 వ శతాబ్దిలో తెలుగు వారి ఘనతను, ప్రతిభను లోకానికి చాటి చెప్పిన మహనీయులెందరో ఉన్నారు. అన్ని సామాజిక రంగాలలోనూ అగ్ర గణ్యులుగా పరిగణితులయ్యేవారు. తమ మేధా సంపద చేత, తమదైన విశిష్టతను లోకం వల్ల గుర్తింపజేసుకున్న వారూ ఉన్నారు. అటువంటి గొప్ప ప్రతిభావంతులలో ముందుగా చెప్పదగిన వాడు దామెర్ల రామా రావు. ఆయన ఆంధ్రులదైన ప్రత్యేకమైన చిత్రకళా శైలిని రూపోందించాడు. దానికి ఆంధ్ర చిత్రకళ అని నామకరణం చేసాడు.

1897 మార్చి 8 న రామారావు రాజమండ్రి లో జన్మించాడు. ఆయనకు ఊహ తెలిసి సృజనాత్మక ప్రతిభ అభివ్యక్తమవుతున్న రోజుల్లో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీకి ఆస్వాల్డ్ కూల్డ్రే ప్రిన్సిపాల్ గా ఉన్నారు. ఆయనకు తెలుగు వాళ్ళ పట్ల ఎంతో అభిమానం. తెలుగు భాష పట్ల మక్కువ. ఆయన ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న రోజుల్లో వడ్డాది సుబ్బారాయుడు గారు ఆ కాలేజీలో తెలుగు బోధించే ఉపాధ్యాయుడు. సుబ్బారాయుడు గారు తెలుగు ఎంతో రసవంతంగా చెప్పేవారు. ఆయన కంఠం విన సొంపుగా ఉండేది. ఆయన పద్యం చదవడం వింటే ఎవరికైనా ప్రాణం లేచి వచ్చేది. అందువల్ల కూల్డ్రే దొర అప్పుడప్పుడు నడవా లో క్లాసుల తనిఖీ చేస్తున్నట్లు పచారులు చేస్తూ సుబ్బారాయుడు గారికి కనబడకుండా ఆయన చదివే తెలుగు పద్యాలు మురిసిపోతూ వినేవారు. ఆయన శిష్యులే కవుకొండల వెంకటరావు, అడివి బాపిరాజు. గురువుగారైన కూల్డ్రే దొర సన్నీ అవర్స్ అనే గ్రంథాన్ని తన శిష్యులు బాపిరాజుకు కవుకొండల వెంకటరావుకు అంకితమిచ్చారు.

దామెర్ల రామారావు చిత్ర కళాభిరుచిని గుర్తించి రామారావు తండ్రి గారైన వెంకట రమణారావును ప్రోత్సహించి బొంబాయిలో జె జె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కు వెళ్ళిందాకా నిద్ర పోలేదు కూల్డ్రే దొర.