తెలుగు కథకులకూ, సాహిత్యాభిమానులకూ, ప్రచురణ కర్తలకూ కథానిలయం విన్నపం

కథానిలయం గురించి కర్ణాకర్ణిగానైనా మీరు వినే వుంటారు.

తెలుగు కథ పుట్టింది మొదలు ఇంతవరకూ వచ్చిన కథల్లో పోయినది పోగా మిగిలిన అన్ని కథలనూ, ఇకముందు రాగల ప్రతికథనూ కథకు సంబంధించిన అన్ని రచనలను సేకరించి పదిలపరచడం దీని ప్రథమ లక్ష్యం. పరిశోధకులకూ కథా విద్యార్థులకూ, రచయితలకూ సహాయపడుతూ తెలుగు కథావికాసానికి బాటలు వెయ్యడం దీని ప్రధాన లక్ష్యం.

ఈ గ్రంధాలయం విశిష్టతను గుర్తించిన సాహితీ ప్రియుల సహాయ సహకారాలతో, దాదాపు మూడు లక్షల వ్యయంతో తలపెట్టిన తొలిదశ నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. అంతర్భాగపు పనులు పూర్తికాగానే 22-2-97 తేదీన రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు రెండు వందల మంది కథకులు సాహిత్యాభిమానులు విచ్చేసి కథానిలయాన్ని ఆవిష్కరించుకున్నారు.

ఎనిమిది వందల పుస్తకాలతో తెరుచుకున్న ఈ గ్రంధాలయం ఈ ఆరు నెలల్లో రెండు వేలకు పైగా పుస్తకాలనూ ప్రత్యేక సంచికలనూ సేకరించుకోగలిగింది. వీటిలో సగం మేరకు కథా సంకలనాలు, సంపుటాలు, కథా రచనకూ విమర్శకూ సంబంధించిన గ్రంధాలూ వున్నాయి.

కథానిలయం కోరికను మన్నించి ఎందరో రచయిత్రులు రచయితలు తమ వివరాలు తమ రచనల వివరాలూ అందజేసారు. వ్యయ ప్రయాసలకోర్చి తమ కథల జిరాక్సులను బౌండ్లుగానూ విడివిడిగానూ పంపించారు.

వీటన్నిన్టి సహాయంతో కథానిలయం ఈ సరికే తనపని ప్రారంభించినది. ఉత్తరాల ద్వారా ఫోన్ల ద్వారా అడిగినవారికి కావలసిన జిరాక్సులు భోగట్టాలు పంపుతోంది

ఐతే ఇంతవరకు సాధించిన ప్రగతి జరగవలసిన దానిలో పదోవంతైనా కాదు. ఒక ప్రక్క భవన నిర్మాణం మరో యాభై వేలతో పూర్తికావలసి వుంది. గత తొమ్మిది దశాబ్దాలలో వచ్చిన కథా సంపుటాలు, సంకలనాలు వేలలోనూ, పత్రికల్లో మిగిలిపోయిన కథలు లక్షలలోనూ సేకరించవలసి వున్నాయి. ఈ రెండే కాక కథానిలయం తలపెట్టినవి మరికొన్ని కూడా వున్నాయి. ఈ పనులన్నీ ఏ కొద్దిమంది పూనికతోనే జరిగే పనులు కావు. కథానిలయం కోసం పూనుకొన్నవారు కొందరే కావచ్చు నెలకొన్న చోటు వొక్కటే కావచ్చు కాని ఈ సంస్థ తెలుగు వారందరిది, వినియోగించుకొనేవారు తెలుగు వారే కాదు - ప్రపంచ దేశాలలో ఎక్కడివారయినా కావచ్చు. ఈ సత్యాన్ని గుర్తించి ప్రతివారు ముఖ్యంగా (తెలుగు కథకులు) తమ సహాయ సహకారాలు వెంటనే అందించవలసిందిగా అభ్యర్థన.

ఇంతవరకూ తమ సహకారం అందించని సాహిత్యాభిమానులందరూ తమ శక్తిమేరకు "కథా నిలయం" అకౌంటు పేర విరాళాలు ఇవ్వవలసిందిగా, ఇప్పించవలసిందిగా అభ్యర్థన. ప్రచురణకర్తలూ, రచయితలూ తాము వెలువరించిన కథాసంపుటాలూ, సంకలనాలూ, థీసీస్సులూ పబ్లిష్ అయిన వ్యాసాలూ ఒకటి రెండు కాపీలు విరాళముగా ఇప్పించగోర్తాము.

పాత కథాసంపుటాలూ, సంకలనాలూ, షాపుల్లో దొరకవు. పుస్తక సేకర్తలు పెద్దమనసుతో సహకరించ వలసినదిగా ప్రార్థన.

రచయిత్రులూ, రచయితలూ, తమ వివరాలు ఒక కాగితం పైన తమ రచనల వివరాలు వేరే కాగితం (లేదా కాగితాలు ) పైన ఈ క్రింది ప్రోఫార్మాలో పంపించండి (సాధ్యమైనంత వేగం: ఒక నెల దాటకుండా )

1. పూర్తి పేరు
2. పుట్టిన తేది
3. పుట్టి పెరిగిన ప్రాంతం
4. కలం పేరు (లేదా పేర్లు)
5. ప్రస్తుత చిరునామా
6. శాశ్వత చిరునామా
7. వెలువరించిన కథా సంకలనాల పట్టిక
8. కథలు సంకలనాలలో వస్తే వాటి వివరాలు
9. కథలకు గానీ సంపుటాలకుగానీ బహుమతులు, అవార్డులు వస్తే ఆ వివరాలు
10.ఇంకా ఇతర విశేషాలు.


కథల వివరాలు:
1. వరుస నెంబరు
2. కథ పేరు
3. ప్రచురించిన పత్రిక
4. తేది
5. ఇతర వివరాలు.


భవదీయులు సంతకం
బి.వి.ఎ. రామారావు నాయుడు
బిల్డింగు కమిటీ కోశాధికారి.


కాళీపట్నం రామారావు
కథానిలయం నిర్వాహకులు
చిరునామా: ఫోను 2469
కథానిలయం, సూర్యానగర్,
విశాఖ బ్యాంకు 'ఏ' కోలనీ
శ్రీకాకుళం - 532 001.